మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఎవరూ ఆపలేరు: కేసీఆర్

మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలని కోరుతూ నిర్వాసిత రైతులు డిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్ పిటిషన్ వేయగా, మరోపక్క దానిని ఎవరూ అడ్డుకోలేరని వచ్చే ఏడాదికల్లా దానిని ఎట్టిపరిస్థితులలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శపథం చేయడం విశేషం. 

కాళేశ్వరం ప్రాజెక్టులో చేయవలసిన కొన్ని మార్పులు చేర్పులపై చర్చించేందుకు ప్రగతి భవన్ లో నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు రాష్ట్రంలో కొన్ని దుష్టశక్తులు కుట్రలు పన్నుతున్నాయి. కానీ ఎవరూ దానిని ఆపలేరు. ఎవరు ఎన్ని అవరోధాలు సృష్టించినా వచ్చే ఏడాదికల్లా ఆ ప్రాజెక్టును పూర్తి చేసి, రైతులకు నీళ్ళు అందించి తీరుతాము,” అని అన్నారు. 

వర్షాలు మొదలయ్యేలోగా బ్యారేజీలు, చెక్ డాంల నిర్మాణపనులను వేగవంతం చేయాలని కేసీఆర్ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావును ఆదేశించారు. అలాగే మళ్ళీ హరితహారం కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రారంభించాలని ఆదేశించారు.

అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో చేపట్టవలసిన మార్పులు చేర్పుల గురించి మంత్రి హరీష్ రావు, సాగునీటి శాఖ ఇంజనీర్లతో ముఖ్యమంత్రి చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే నిజాం సాగర్, సింగూరు, శ్రీరాం సాగర్ ప్రాజెక్టులలో నీళ్ళు నింపినట్లయితే ముందు అనుకొన్న ఆయకట్టు అంతా స్థిరీకరించవచ్చని నిర్ణయించారు. దీని కోసం మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ పద్దతిలో సింగూరుకు నీటిని తరలించి అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాం సాగర్ కు తరలించాలని నిర్ణయించారు. మద్యలో ఒక లిఫ్టు పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయవలసి ఉంటుందని నిర్ణయించారు. కొండపోచ్చంమ రిజర్వాయర్ ప్రస్తుత సామర్ధ్యం 7 టి.ఎం.సి.లు దానిని 21 టి.ఎం.సి.లకు పెంచాలని నిర్ణయించారు.