హైదరాబాద్ లో తెదేపా ఎమ్మెల్సీ అరెస్ట్

హైదరాబాద్ నగరంల్ పలు ప్రాంతాలలో భూకబ్జాలు చేస్తున్నరనే ఆరోపణలతో సిటీ సి.సి.ఎస్. పోలీసులు తెదేపా ఎమ్మెల్సీ జి. దీపక్ రెడ్డిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. అతనితో పాటు న్యాయవాది శైలేంద్ర సక్సేనా, రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ లను కూడా అరెస్ట్ చేసారు. దీపక్ రెడ్డి ఆసిఫ్ నగర్ లో రూ.163కోట్లు విలువ గల భూములను, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో 3.37ఎకరాలను ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. అదిగాక గుడి మల్కాపూర్ లోని బోజగుట్టలో 78ఎకరాలను కబ్జా చేసేందుకు ముగ్గురూ కలిసి చాలా బారీ పధకం పన్నారు. ఇక గత ఐదేళ్ళ నుంచి  దీపక్ రెడ్డిపై 11 సివిల్ కేసులు కోర్టులలో నడుస్తున్నాయి. షేక్ పేట తహసిల్దార్ పిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన తరువాత జైలుకు తరలించారు. 

భూకబ్జాలకు పాల్పడుతూ అరెస్ట్ అయిన దీపక్ రెడ్డి తెదేపా ఎంపి జేసి దివాకర్ రెడ్డికి స్వయానా మేనల్లుడు. అయితే ఈ అక్రమాలు, భూ కబ్జాలతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తనను అన్యాయంగా కేసులలో ఇరికించారని, జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత వాస్తవాలు వివరిస్తానని దీపక్ రెడ్డి మీడియాకు తెలిపారు. మేనల్లుడి అరెస్ట్ పై జేసి బ్రదర్స్ ఇంకా స్పందించలేదు. దీపక్ రెడ్డి కొన్ని నెలల క్రితమే తెదేపా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.