జి.హెచ్.ఎం.సి. కాంట్రాక్టర్లకు కేటిఆర్ వార్నింగ్

గత ఏడాది బారీ వర్షాలు కురిసినప్పుదు హైదరాబాద్ దాదాపు జలదిగ్బందనం అయిన సంగతి తెలిసిందే. అందుకు కారణం నాలాల ఆక్రమణ, నాలాలలో చెత్తను ఎప్పటికప్పుడు తరలించడంలో నిర్లక్ష్యం..అవినీతి. ఇక జి.హెచ్.ఎం.సి.పరిధిలో డ్రైనేజీ కాలువలు, పైపుల నిర్వహణ పనులు చూస్తున్న కాంట్రాక్టర్లు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరో కారణం. నగరంలో కురిసిన బారీ వర్షాలకు గుంతలు పడి, కొట్టుకుపోయిన రోడ్లు అవి ఎంత నాసిరకంగా నిర్మించబడ్డాయో కళ్ళకు కట్టినట్లు చూపాయి.

అప్పటి నుంచి మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఈ సమస్యలన్నిటిపై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక సంస్కరణలు, కటిన చర్యలు తీసుకొన్నారు. జి.హెచ్.ఎం.సి. పరిధిలో కొత్తగా 1,000 కిమీ పొడవున మురికి కాలువలు నిర్మింపజేశారు. నాలాలపై ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా తొలగింపజేసి మురుగు నీరు బయటకు పారేందుకు అవసరమైన సివిల్ పనులు చేయించారు. నాలాలలో వ్యర్ధాల తరలింపులో అవినీతి, అక్రమాలకు పాల్పడినవారిపై కటిన చర్యలు తీసుకొన్నారు. అలాగే నగరంలో రోడ్ల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొన్నారు. వారితో లులూచిపడిన అధికారులను విడిచిపెట్టకుండ వారిపై కూడా కటిన చర్యలు తీసుకొన్నారు. 

గత ఏడాది నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులను శుభ్రం చేసే కార్మికులు ఇద్దరు దుర్మరణం పాలవడంతో అందుకు ఆ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొన్నారు. అతనిచేత ఆ కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం కూడా చెల్లింపజేశారు. మళ్ళీ అటువంటి ప్రమాదాలు జరుగకుండా నివారించేందుకు 70 మినీ సివరేజీ జెట్టింగ్‌ వాహనాలను ఏర్పాటు చేశారు. వాటిని నిన్నటి నుంచి మున్సిపల్ శాఖకు అందుబాటులోకి తెచ్చారు. ఇకపై చాలా వరకు వాటి సహాయంతోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపులలో మరియు మ్యాన్ హోల్స్ పూడికలను బయట నుంచే తొలగించవచ్చు. అవసరం అయితే ఇంకా ఎన్ని వాహనలనైనా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని కేటిఆర్ చెప్పారు. గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ఇక నుంచి కాంట్రాక్టర్లు ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే వారిని బ్లాక్ లిస్టులో పెడతామని మంత్రి కేటిఆర్ హెచ్చరించారు.