మియాపూర్ భూకుంభకోణంపై భాజపా ప్రధాన అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ మియాపూర్ భూకుంభకోణం దేశంలోకెల్లా అతిపెద్ద భూ కుంభకోణాలలో ఒకటి. అది బయటపడి 10 రోజులవుతున్నా ఇంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు దానిపై స్పందించడం లేదు? మా పార్టీ అధినేత అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తే పనిగట్టుకొని మరీ మీడియా సమావేశం పెట్టి మాపై ఎదురుదాడి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భూకుంభకోణంపై ఎందుకు మట్లాడటం లేదు? ఆయన మౌనం ఈ వ్యవహారంలో కొందరు సీనియర్ మంత్రుల హస్తం ఉందనే అనుమాలను బలపరుస్తున్నట్లుంది. ఈ వ్యవహారంలో ఉపముఖ్యమంత్రి స్వయంగా రూ.50 కోట్లు విలువగల భూములను బినామీ పేర్లకు బదిలీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సంగతి ఆయన సిబ్బందికి కూడా తెలుసు. కనుక అలాగే ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రదారి గోల్డ్ స్టోన్ కంపెనీ డైరెక్టర్ ప్రసాద్ తదితరులతో పార్టీ నేతలకు గల సంబంధాలను ముఖ్యమంత్రి బయటపెట్టాలి. ఈ కుంభకోణం సూత్రధారులను శిక్షించాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి ఉన్నట్లయితే దీనిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని భాజపా ప్రధాన అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు అన్నారు.