గుంటూరులో ఆదివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం చాలా ఆసక్తికరంగా సాగింది. “డాక్టర్ మన్మోహన్ సింగ్..ప్రధానమంత్రి హోదాలో ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో వాగ్దానం చేశారు. ఆయన వ్యక్తిగతంగా ఇచ్చిన హామీ కాదది. దానిని అమలుచేయవలసిన బాధ్యత తరువాత అధికారంలోకి వచ్చిన మోడీపై ఉంది. హిందుమతాన్ని ఉద్దరిస్తున్నానని చెప్పుకొంటున్న ఆయన కూడా తిరుపతి వెంకన్న సాక్షిగా ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్ధానం చేసారు. కానీ ఆ భగవంతుడి సన్నిధిలో చేసిన ప్రమాణాన్ని కూడా అమలుచేయలేదు. రాష్ట్ర విభజన వలన ఏపికి చాలా నష్టం జరుగుతోందనే ఉద్దేశ్యంతోనే మేము ప్రత్యేక హోదా ఇవ్వాలనుకొన్నాము. కానీ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మాకు అది అవసరం లేదంటున్నారు! ఎందుకో తెలియదు. ప్రత్యేక హోదా కావాలని ప్రధాని నరేంద్ర మోడీని గట్టిగా అడగడానికి వాళ్ళిద్దరూ చాలా భయపడుతున్నారు. వారిరువురిపై ఏమి ఒత్తిళ్ళు ఉన్నాయో..మోడీని చూసి వాళ్ళిద్దరూ ఎందుకు భయపడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు.
ఏపికి ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలందరూ కదిలివచ్చారు. కానీ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాకపోవడం బాధాకరం. ఎవరు కలిసివచ్చినా రాకపోయినా మేము ఏపికి ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాడుతామని ప్రజలకు హామీ ఇస్తున్నాను. 2019 ఎన్నికలలో గెలిచి మేమే అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు ప్రత్యేక హోదా ఫైల్ పైనే తొలిసంతకం చేస్తాము,” అని రాహుల్ గాంధీ అన్నారు.
2019 ఎన్నికలలో యూపిఎ కూటమి గెలుస్తుందో లేదో తెలియదు. గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి దక్కుతుందో లేదో తెలియదు కానీ ఒకవేళ గెలిస్తే తనే ప్రధానమంత్రి అవుతానని రాహుల్ గాంధీ కలలు కంటున్నట్లున్నారు. అందుకే ‘తొలి సంతకం’ అంటున్నట్లున్నారు. అదో తుత్తి!