కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అయన కుటుంబ సభ్యులపై ఎదురుదాడి చేశారు. వారు కేసీఆర్, అయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత స్థాయిలో చాలా తీవ్ర ఆరోపణలు చేశారు.
మంత్రి కేటిఆర్ రాహుల్ గాంధీపై విమర్శించినందుకు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “కేటిఆర్ రాజకీయాలలో ఒక బచ్చా..ఆయనా జాతీయనాయకుడైన మా రాహుల్ గాంధీని విమర్శించేది? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం వారిది. కానీ కేసీఆర్ కుటుంబం రాష్ట్రం కోసం ఏమి త్యాగాలు చేసింది?మియాపూర్ భూకుంభకోణం వెనుక కేసీఆర్ సమీప బంధువు ఒకరున్నారు. కేసీఆర్ కు దమ్ముంటే ఈ కేసును సిబిఐకి అప్పగించాలి. అప్పుడు దీని వెనుక ఎవరెవరున్నారో అందరి పేర్లు బయటకు వస్తాయి,” అని షబ్బీర్ అలీ సవాలు విసిరారు.
నిజామాబాద్ తెరాస ఎంపి కవితపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధుయాష్కి వ్యక్తిగత స్థాయిలో విమర్శలు గుప్పించడం విశేషం. ఒకప్పుడు కవిత కుటుంబం చిన్న అపార్ట్ మెంటులో నివసించేది. ఆయన భర్త ఎటువంటి వ్యాపారాలు చేయడం లేదు. మరి ఏమీ చేయకుండానే కోట్లు విలువ చేసే పెద్ద విల్లాలోకి వారు ఎలా మారగలిగారు? వ్యాపారాలు చేయకుండా, అవినీతికి పాల్పడకుండా ఇంత తక్కువ కాలంలో ఇన్ని ఆస్తులు ఏవిధంగా పోగు చేశారు? అని మధుయాష్కి ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. మియాపూర్ భూ కుంభకోణంలో పైకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు వినపడుతున్నప్పటికీ, ఆయన వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారని మధుయాష్కి ఆరోపించారు.