శుక్రవారం గాంధీ భవన్ లో సీనియర్ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ పై, ఆయన పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణా పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్..అయన కుటుంబం చేతిలో తెలంగాణా బందీ అయిపోయిందని అన్నారు. ఈ మూడేళ్ళలో చేసిందేమీ లేకపోయినా గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. మూడేళ్ళ కేసీఆర్ పాలనలో అప్పుల పాలైన రాష్ట్రం తిరోగమనం పధంలో పయనిస్తోందని, పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ పేరు తలుచుకోకపోవడాన్ని మల్లు రవి తప్పు పట్టారు.
టిపిసిసి ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, “తండ్రి కొడుకులు గడి లాంటి ప్రగతి భవన్ కట్టుకొని అందులో కూర్చొని అన్ని శాఖలకు సంబంధించిన నిర్ణయాలు వారే తీసుకొంటున్నారు. వారిద్దరూ కలిసి మంత్రులందరినీ డమ్మీలుగా చేసి ఇష్టం వచ్చినట్లు పరిపాలన సాగిస్తున్నారు. సీనియర్ మంత్రులు సైతం తమ శాఖల గురించి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఈటెల, నాయిని, మహ్మూద్ అలీ, వంటి సీనియర్ మంత్రులు తమ శాఖలలో జరిగే పనులపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అన్నీ తండ్రీకొడుకులే నిర్ణయిస్తున్నారు,” అని విమర్శించారు.