“ప్రజాభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన జరిగిన ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజు..నేటికీ నేను రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేకపోతున్నాను,” అని ఏపి సిఎం చంద్రబాబు నాయుడు అన్న మాటలకు రాష్ట్ర సాగునీటిశాఖ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. “ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణా ప్రజలందరూ పండుగ చేసుకొంటుంటే మాకు చీకటి రోజని చెప్పి చంద్రబాబు నాయుడు మళ్ళీ మరోసారి తెలంగాణా మీద తన అక్కసు వెళ్ళగక్కుకొన్నారు. ఆయన అక్కసు దేనికంటే తెలంగాణాతో పోటీపడలేకపోతున్నందుకు. అందుకే తన వైఫల్యాలను విభజన పేరు చెప్పి కప్పిపుచ్చుకొంటూ ఈవిధంగా మాట్లడుతున్నారు. తెలంగాణా ప్రజలను కించపరిచేవిధంగా మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణా పట్ల అంత వ్యతిరేకత ప్రదర్శిస్తున్న చంద్రబాబు నాయుడు మాటలకు ఇక్కడి తెదేపా నేతలు సిగ్గుతో తలదించుకోవాలి,” అని హరీష్ రావు అన్నారు.
ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో పదేపదే సోనియా గాంధీ దయతలచి తెలంగాణా ఇచ్చారన్నట్లు మాట్లాడటాన్ని కూడా హరీష్ రావు తప్పు పట్టారు. తెలంగాణా ఎవరి దయాధర్మాలతో వచ్చింది కాదని, తెలంగాణా ప్రజలు పోరాడి సాధించుకొన్నారని అన్నారు. దశాబ్దాలుగా కుటుంబ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి తెలంగాణా ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు.