ఆ కుంభకోణంలో మంత్రి తలసాని పాత్ర ఉందిట

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మియాపూర్ భూకుంభకోణంలో తలసాని హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు డబ్బులు వసూలుచేసిపెట్టే ఎజన్టుగా మంత్రి తలసాని వ్యవహరిస్తున్నారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. కనుక ఆరోపణలు ఎదుర్కొంటున్న తలసానిని తక్షణం పదవిలో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 

గతంలో నయీం కేసును, భూదాన్ కుంభకోణంపై దర్యాప్తును తెరాస సర్కార్ అటకెక్కించేసినట్లుగానే సిఐడి చేత విచారణ జరిపిస్తే ఈ కేసును కూడా అటకెక్కించేయడం ఖాయం అని అన్నారు. పెద్ద చేపలను వదిలిపెట్టి, చిన్న చేపల వంటి అధికారులపై బదిలీ వేటు వేసి తెరాస సర్కార్ తప్పించాలనుకోవడం సరికాదని అన్నారు. కనుక ఈ కేసులో దోషులను పట్టుకొని శిక్షించాలనే ఆలోచన, చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నట్లయితే దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.