రెవెన్యూ మంత్రిని తొలగించాలి: సిపిఎం

మియాపూర్ భూకుంభకోణం వ్యవహారంలో క్రింద స్థాయి అధికారులను బదిలీలు చేసి తెరాస సర్కార్ తప్పించుకొనే ప్రయత్నం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి తక్షణం తన పదవిలో నుంచి తప్పుకోవాలని లేకుంటే ముఖ్యమంత్రి కేసీఆరే ఆయనను, రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారులను తొలగించాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి దోచుకొంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ఇకనైనా తెరాస సర్కార్ మేల్కొని రూ.10,000 కోట్ల ఈ భూకుంభకోణంపై హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం తక్షణం గట్టి చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నవారిపై, వారికి సహకరిస్తున్న అధికారులపై కటిన చర్యలు తీసుకోవాలని తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.