పెద్దపల్లిలో మిర్చి రైతు ఆత్మహత్య

మిర్చిరైతులను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో ముత్తారం మండలం సీతంపేట గ్రామానికి చెందిన లింగం శంకర్ అనే మిర్చి రైతు అప్పుల బాధలు భరించలేక మంగళవారం తన పొలంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. అతను తనకున్న 4 ఎకరాల భూమిలో అప్పులు చేసి మిర్చి పండించాడు. అతని కష్టం ఫలించి దిగుబడి చాలా బాగానే వచ్చింది. కానీ మిర్చికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో కనీసం దానిపై పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. ఒకవైపు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన శంకర్, మరోవైపు అప్పుల బాధలను భరించలేక తీవ్ర ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్య చేసుకొన్నాడు. 

రైతులు ఆత్మహత్య చేసుకొన్నాక ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంటుంది. అదేవారు బ్రతికి ఉన్నప్పుడే స్థానిక ప్రజాప్రతినిధులు..ముఖ్యంగా అధికార పార్టీ ప్రతినిధులు వారికి కాస్త ధైర్యం చెప్పి, వారి సమస్యల పరిష్కారం కోసం తమ స్థాయిలో అయినా కృషి చేసి ఉండి ఉంటే ఈవిధంగా అన్నదాతలు ప్రాణాలు తీసుకొని ఉండేవారు కాదు కదా? ఎన్ని లక్షల నష్ట పరిహారం ఇచ్చినా పోయిన ఆ రైతు ప్రాణం తిరిగి తీసుకు రాగలమా? ఆ కుటుంబ శోకాన్ని తీర్చగలమా?

పార్టీ కార్యక్రమాలను నిర్వహించేందుకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నేతలను, కార్యకర్తల సేవలను ఎంతో సమర్ధంగా ఉపయోగించుకొనే పార్టీలు, ప్రభుత్వాలు, అదే తీరుగా వారి ద్వారా గ్రామాలలో రైతన్నల మంచి చెడ్డలు, కష్టనష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ఎందుకు కాపాడుకోలేకపోతోంది? 

రైతన్నల కష్టాలకు ప్రభుత్వం ఒక్కటే బాధ్యత వహించాలా? ప్రతిపక్షాలకు వారి సమస్యలపై రాజకీయాలు చేయడం తప్ప తమ శక్తి, పరపతిని ఉపయోగించి రైతులను ఆదుకోలేవా? ప్రభుత్వం నుంచి అనేక రాయితీలు అందుకొంటున్న బడా పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంస్థలకు సామాజిక బాధ్యతగా రైతులను ఎందుకు ఆదుకోరు? కోట్ల రూపాయల పారితోషికం తీసుకొని పీడిత ప్రజలను, రైతులను ఆదుకొంటున్నట్లు సినిమాలలో గొప్పగా నటించే నటీనటులకు నిజజీవితంలో రైతులను ఆదుకోవడానికి ఎందుకుముందుకు రారు? వారికి ఎటువంటి సామాజిక బాధ్యత ఉండదా? అని ఆలోచిస్తే రైతన్నలను ఆదుకోవడానికి అనేక మార్గాలు కళ్ళ ముందు కనిపిస్తాయి.