ఎంత పెద్ద గుమ్మడి కాయ అయినా కత్తిపీటకు లోకువే అన్నట్లు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సిబ్బందికి ఎమ్మెల్యేలయినా ఒకటే..సామాన్య ప్రజలైన ఒకటే అన్నట్లుగా వ్యవహరిస్తుండటం విశేషం. సిద్ధిపేట జిల్లాలో దుబ్బాక తెరాస ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత తన సమీప బందువు అనారోగ్యం పాలవడంతో అతనిని మంగళవారం ఉదయం గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అతని మానసిక స్థితి సరిగా లేనందున ఆసుపత్రి సిబ్బంది అతనిని ఆసుపత్రిలో చేర్చుకోవడానికి ఆమెకు సహకరించలేదు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యే భార్యనని ఆమె చెప్పినా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. పైగా ఆమె తన బందువును ఆసుపత్రులోకి తీసుకువెళ్ళడానికి వీల్ చైర్ అడిగితే దాని కోసం ఆమెను లంచం కూడా అడిగారు. ఆసుపత్రి సిబ్బంది అక్కడే ఉన్నప్పటికీ ఎవరూ ఆమెకు సహాయపడకపోవడంతో ఆమె స్వయంగా అతనిని అతికష్టం మీద వీల్ చైర్ లో కూర్చోబెట్టి లోపలకి తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు. కనీసం అప్పటికైనా ఆసుపత్రిలో వైద్యులు కానీ సూపరింటెండెంట్ గానీ ఆమెను పట్టించుకోకుండా వ్యవహరించడం విశేషం.
తరువాత ఈ విషయం బయటకు పొక్కకుండా ఆసుపత్రి వర్గాలు చాలా ప్రయత్నించినప్పటికీ అప్పటికే మీడియాకు ఈ వార్త చేరిపోయింది. దీనిపై తెరాస సర్కార్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే భార్యకే ఇటువంటి చేదు అనుభవం ఎదుర్కోవలసి వస్తే ఇక గాంధీ ఆసుపత్రిలో రోజూ సామాన్యప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో..ఊహించడం కష్టమే.