మియాపూర్ భూకుంభకోణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు రెవెన్యూ అధికారులతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యి పలు సూచనలు చేశారు. ఇటువంటి కుంభకోణాలకు వీలు కల్పిస్తున్న రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ చేసుకొనే సౌకర్యాన్ని తొలగించమని కేసీఆర్ ఆదేశాల ప్రకారం అధికారులు తక్షణమే దానిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సామాన్య ప్రజలు తమ స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే లంచాలు చెల్లించుకోవడం తప్పదనే భావన కలిగి ఉన్నారని అది రిజిస్ట్రేషన్ శాఖ పనితీరుకు అద్దం పడుతోందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనుక రిజిస్ట్రేషన్ శాఖలో పేరుకుపోయిన అవినీతిని, అక్రమాలను తొలగించాలంటే సమూల ప్రకశాలన అవసరం అని కేసీఆర్ చెప్పారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో పారదర్శకత, వేగం సాధించేందుకు అవసరమైన సంస్కరణలు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మియాపూర్ భూకుంభకోణంలో దోషులను కనిపెట్టి వారిపై చర్యలు తీసుకోనేదుకు సిఐడి దర్యాప్తుకు ఆదేశించారు. ఈ కుంభకోణంలో ఎంత పెద్దవారున్నా విడిచిపెట్టవద్దని అధికారులకు ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు బి.ఆర్ మీనా, నదీమ్ అహ్మద్, శాంత కుమారి, ఐజి పూర్ణచందర్ రావు, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.