భాజపా సీనియర్ నేతలపై విచారణ షురూ

కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమా భారతి, భాజపా సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, విశ్వహిందు పరిషత్ నేతలు వినయ్ కటియార్, విష్ణు హరి దాల్మియా, సాధ్వీ రీతాంబరి తో సహా మొత్తం 13మంది ప్రముఖులు  బాబ్రీ మశీదు విద్వంసం కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు కొద్ది సేపటి క్రితం లక్నో చేరుకొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి వెళ్ళి వారిని కలిసి వచ్చారు.

నేటి నుంచి లక్నో కోర్టులో మళ్ళీ బాబ్రీ మశీదు విద్వంసం, దానిలో వారి పాత్రలపై విచారణ జరుగుతుంది. ఈ కేసుకు వ్యక్తిగత హాజరు నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలనే వారి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు త్రోసిపుచ్చడమే కాకుండా, ఈ కేసు విచారణను పూర్తి చేయడానికి రెండేళ్ళు గడువు కూడా విదించింది. ఆ లోగా రోజువారిగా విచారణ చేస్తూ ఆ వివరాలను, కేసు పురోగతి గురించి ఎప్పటికప్పుడు తమకు తెలియజేస్తూ ఉండాలని సుప్రీంకోర్టు లక్నో ప్రత్యేక సిబిఐ కోర్టును ఆదేశించింది. ఇక ఈ కేసు విచారణ సమయంలో చాలా బలమైన కారణాలున్నట్లు భావిస్తే తప్ప ఎవరికీ కేసు వాయిదాలు ఈయకూడదని, ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకు దీనిని విచారిస్తున్న సిబిఐ న్యాయమూర్తి ఎస్.కె. యాదవ్ ను బదిలీ చేయరాదని ఆదేశించింది.