698 ఎకరాల ప్రభుత్వ భూములు హాం ఫట్!

ఈరోజుల్లో హైదరాబాద్ లో వంద గజాల స్థలం కొనుగోలు చేయడం సామాన్య ప్రజలకు దాదాపు అసాధ్యం. భూముల ధరలు అంతగా పెరిగిపోయాయి. కానీ శేరిలింగంపల్లి మండలంలోని మియాపూర్ లో ఏకంగా 698 ఎకరాల ప్రభుత్వ భూములను కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బి.ఎస్. పార్ధసారధి, పి.వి.ఎస్.శర్మ తదితరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసేశారు. ఆ భూముల విలువ ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం సుమారు రూ.10,000 కోట్ల వరకు ఉండవచ్చని మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ ఎన్.సైదారెడ్డి చెప్పారు. ఆయన పిర్యాదు మేరకు కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, పార్ధసారధి, శర్మలను అరెస్ట్ చేశారు. ఏటా జరిగే ఇంటర్నల్ ఆడిటింగ్ లో ఈ బారీ కుంభకోణం బయటపడినట్లు సైదారెడ్డి చెప్పారు. ఆ భూముల వివరాలు: మియాపూర్ గ్రామంలో సర్వే నెంబర్స్: 101,20,28,100.  

మొదట ఆ భూములను ఎప్పుడో నవాబులు కొందరికి దానం చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, వాటిని మరొకరికి, మళ్ళీ మరొకరికీ బదిలీ చేసి చివరిగా ట్రినిటి ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పార్ధ సారధికి, సువిశాల్ పవర్ జెన్ లిమిటెడ్ డైరెక్టర్ పివి.ఎస్ శర్మ మరో ఇద్దరు బిల్డర్ల పేరిట రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. ఈ కుంభకోణంలో సహకరించినందుకు కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు కొన్ని కోట్ల రూపాయలు లంచం తీసుకొన్నట్లు ప్రాధమిక విచారణలో తేలింది. ఈ కుంభకోణం బయటపడగానే జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి, వారి ఆదేశాల మేరకు ఈ భూముల రిజిస్ట్రేషన్ ను రద్దు చేశామని సైదారెడ్డి చెప్పారు. ఈ బారీ కుంభకోణం వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయం పోలీసుల దర్యాప్తులో బయటడుతుందని చెప్పారు.