రేవంత్ కు తలసాని కొడంగల్ మే సవాల్!

అదేదో సినిమాలో హీరో “నీ ఊరుకి వస్తా..నీ వీధికి వస్తా..నీ ఇంటికి వస్తా..ఎక్కడైనా..ఎప్పుడైనా సరే ఫైట్ కు నేను రెడీ..నువ్వు రెడీయేనా?” అని కొట్టిన పంచ్ డైలాగ్ నేటికీ వినబడుతూనే ఉంటుంది. దానిని సినిమా వాళ్ళ కంటే మన రాజకీయ నేతలే ఎక్కువగా వాడేసుకొంటున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ లో మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి నోరుంది కదాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము. ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఏకవచనంలో సంభోదిస్తూ మాట్లాడితే తగిన గుణపాఠం చెపుతాము. నేను సనత్ నగర్ లో నైనా కొడంగల్ లో అయినా పోటీ చేసిగెలువగలను. రేవంత్ రెడ్డికి దమ్ముంటే నన్ను ఎదుర్కొని ఓడించాలి. లేకుంటే రాజకీయాల నుంచి శాస్వితంగా తప్పుకోవాలి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటు. అయన తెలంగాణా ద్రోహులతో జతకట్టిణ తెలంగాణా ద్రోహి. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాను,” అని అన్నారు.