భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇటీవల తెలంగాణాలో పర్యటించినప్పుడు రాష్ట్రంలో భాజపా పరిస్థితిని సమీక్షించి పార్టీ నేతలను గట్టిగా హెచ్చరించారు. హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడితే సరిపోదని బూత్ స్థాయి వరకు ప్రతీ నేత పర్యటించి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేయాలని చెప్పారు. వచ్చే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలని అమిత్ షా గట్టిగా చెప్పారు. ఈ పర్యటనలో కిషన్ రెడ్డితో సహా కొంతమంది నేతలను పనితీరు మెరుగుపరుచుకోవలసిందిగా అమిత్ షా గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం.
ఆ హెచ్చరికలతో మేల్కొన్న రాష్ట్ర భాజపా నేతలు ఆయన సూచించిన వ్యూహం ప్రకారం నేటి నుంచి ఇంటింటికీ వెళ్ళి ప్రజలను కలిసే కార్యక్రమం మొదలుపెట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ మొదలు మండల స్థాయి అధ్యక్షుడు వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని మొత్తం 32,000 పోలింగ్ బూత్ పరిధిలో నివసిస్తున్న ప్రజలను కలువబోతున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 8,000 మంది రాష్ట్ర భాజపా నేతలు పాల్గొనబోతున్నారు. ఒక్కొక్కరూ కనీసం 4-6 పోలింగ్ బూత్ పరిధిలో ప్రజలను కలిసి మోడీ సర్కార్ చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ అదే సమయంలో తెరాస హామీల అమలులో వైఫల్యం, తెరాస సర్కార్ పాలనలో లోటుపాట్ల గురించి ప్రజలకు వివరిస్తారు. ఇంటింటికీ బిజెపి అనే ఈ కార్యక్రమం నేటి నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు కొనసాగుతుంది.