రజనీ..ఆ పని మాత్రం చేయకండి: జయప్రద

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్నారనే వార్తలపై అలనాటి అందాలనటి, మాజీ ఎంపి జయప్రద తన అభిప్రాయం చెప్పారు. “రజనీకాంత్ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే గొప్ప వ్యక్తి. ఆయన రాజకీయ పార్టీ స్థాపించి ప్రత్యక్ష రాజకీయలలోకి రాబోతున్నారనే వార్తలు చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకు ఇదే తగిన సమయం అని నేను భావిస్తున్నాను. ఆయన రాజకీయాలలో ప్రవేశించదలిస్తే నేను స్వాగతిస్తాను. అయితే ఆయనకు ఒక సూచన చేస్తున్నాను. అయన చిరంజీవిలా పార్టీ పెట్టిన తరువాత వెనకడుగు వేయకుండా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా ముందుకే సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రజనీకాంత్ రాజకీయాలలోకి వస్తే తమిళనాడు ప్రజలు ఆయనకు బ్రహ్మరధం పడతారు. కనుక ఆయన రాజకీయాలలో బాగా రాణించే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.

చిరంజీవి రాజకీయ ప్రవేశం, తదనంతర పరిణామాలను రజనీకాంత్ చాలా నిశితంగానే గమనించారు. ఒకవిధంగా ప్రజారాజ్యం వైఫల్యం కూడా రజనీకాంత్ పై ఎంతో కొంత ప్రభావం చూపి ఉండవచ్చు కనుక ఆయన రాజకీయాలలో ప్రవేశించడానికి సంకోచించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు తమిళనాడులో రాజకీయ శూన్యత, అభిమానుల ఒత్తిడి కారణంగా రాజకీయాలలోకి ప్రవేశించడానికి సిద్దపడుతున్నట్లున్నారు. కానీ జయప్రద చేసిన సూచనను ఆలోచించి ముందడుగు వేయడం చాలా మంచిది.