బాషా వచ్చేస్తున్నాడహో...

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో రాజకీయాలలో ప్రవేశించబోతున్నారు. ఈ విషయం ఆయన సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్ వెల్లడించారు. రజనీకాంత్ జూలై నెలలో ఒక కొత్త రాజకీయ పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల రజనీ తన అభిమానులతో ఫోటో షూట్ కోసం సమావేశమైనప్పుడు, వారి కోరిక మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకొన్నారని సత్యనారాయణ రావు చెప్పారు. పార్టీ పెట్టి రాజకీయాలలోకి ప్రవేశించాలని నిర్ణయించుకొన్నారు కనుక ఇక నుంచి తన అభిమానులతో ఆయన తరచూ సమావేశమవుతూ పార్టీ నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెడతారని చెప్పారు.   

రజనీకాంత్ రాజకీయాలలో ప్రవేశించమని పైనున్న ఆ దేవుడు శాశించాడో లేదో తెలియదు కానీ అనేక ఏళ్ళపాటు ఆయన రాక కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన ఆయన అభిమానులు ఎట్టకేలకు ఆయనను ఒప్పించి రాజకీయాలలోకి రప్పించుకొంటున్నారు. 

జయలలిత మరణం తరువాత తమిళనాడులో రాజకీయ శూన్యత, స్తబ్దత నెలకొని ఉంది. పన్నీర్ సెల్వం-పళనిస్వామి వర్గాలు రాజీపడి ఉండి ఉంటే, బహుశః రజనీకాంత్ కు ఈ ఆలోచన బలపడి ఉండేది కాదేమో? రజనీకాంత్ రాజకీయ ప్రవేశంతోనైనా వాళ్ళిదరూ ఒకటవుతారేమో చూడాలి. ఇక ఆయన రాజకీయ ప్రవేశం ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకేకి చాలా పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. రజనీ ఎంట్రీతో ఆ పార్టీకి వచ్చే ఎన్నికలలో గెలిచే అవకాశాలు తగ్గిపోవచ్చు. అలాగే తమిళనాడులో నెలకొన్న ఈ రాజకీయ శూన్యతను వినియోగించుకొని ఆ రాష్ట్రంలో అడుగుపెట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నా భాజపాకు కూడా ఇది చాలా నిరాశ కలిగించే విషయమే. అయినా రజనీకాంత్ పార్టీ పెట్టి రాజకీయాలలో ప్రవేశించే వరకు అనుమానమే. మళ్ళీ ఏవైనా ఒత్తిళ్ళు వస్తే ఆఖరునిమిషంలో వెనక్కు తగ్గినా తగ్గవచ్చు.