కాంగ్రెస్ పార్టీ తెదేపాతో పొత్తుల కోసం అర్రులు చాస్తుండటాన్ని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ తెదేపాతో పొత్తులు పెట్టుకోవాలని ఎందుకు అనుకొంటోందో గానీ అది రాజకీయంగా ఆత్మహత్యతో సమానమేనని చెప్పగలను. ఎందుకంటే తెదేపా మొదటి నుంచి చివరి వరకు కూడా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. తెదేపా అంటే తెలంగాణా ద్రోహుల పార్టీ అని అర్ధం. దానితో కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకొంటానంటే మా నెత్తిన పాలు పోసినట్లే భావిస్తాము,” అని అన్నారు.
నాగం జనార్ధన్ రెడ్డి గురించి మాట్లాడుతూ “ఆయన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఒక శిఖండిలా తయారయ్యి అడ్డుపడుతున్నారు. ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ మా పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బలహీన వర్గాలకు మా ప్రభుత్వం గొర్రెలు, మేకలు అందిస్తుంటే దానికీ ఆయన అడ్డుపడుతున్నారు. ఆయనకు ప్రజలే గట్టిగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.