ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు తెరాస కీలక సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు అందరూ హాజరవుతారు. అమిత్ షా పర్యటన కారణంగా రాష్ట్రంలో భాజపా నుంచి ఎదురవుతున్న సవాళ్ళ నేపధ్యంలో ఆ పార్టీతో ఏవిధంగా వ్యవహరించాలనే విషయంపై నేటి సమావేశంలో చర్చించి పార్టీ నేతలకు కేసీఆర్ మార్గదర్శనం చేయవచ్చు. అలాగే రాష్ట్ర స్థాయిలో భాజపాతో గొడవపడుతున్నప్పుడు అది నిలబెట్టబోతున్న రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలా..వద్దా అనే విషయంపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
ధర్నా చౌక్, సచివాలయ నిర్మాణం, జూన్ 2 నుంచి ప్రారంభించబోతున్న ఒంటరి మహిళలకు పెన్షన్లు అమ్మ ఒడి, కేసీఆర్ కిట్స్ మొదలైన పధకాలు, తెలంగాణా రాష్ట్ర అవిర్భావోత్సవ వేడుకల నిర్వహణ గురించి కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. తెరాస ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ నివేదికలను బయటపెట్టబోతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికలకు అప్పుడే రాష్ట్రంలో అన్ని పార్టీలు సిద్దం అవుతున్నందున ఈ సమావేశంలో తెరాస కార్యాచరణను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.