భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణా పర్యటన రాష్ట్ర రాజకీయాలను ఊహించిన దానికంటే ఎక్కువగానే వేడెక్కించింది. భాజపా-తెరాసల మద్య జరుగుతున్న మాటల యుద్ధంలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా చేరి భాజపాపై ఓ రాయి వేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో భాజపా హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని గెలుచుకోవాలని కలలు కంటోంది. కానీ అది సికింద్రాబాద్ స్థానాన్ని కూడా మా పార్టీకి కోల్పోబోతోంది. అంతేకాదు..ఘోషా మహల్, ఖైరతాబాద్, అంబర్ పెట్ తదితర శాసనసభ స్థానాలను కూడా కోల్పోబోతోంది. అమిత్ షాకు దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేసి గెలిచి చూపించాలి. గతంలో 1996 ఎన్నికలలో వెంకయ్య నాయుడు హైదరాబాద్ నుంచి పోటీ చేసి మా పార్టీ చేతిలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికలలో కూడా అదే జరుగబోతోంది,” అని అన్నారు.
రాష్ట్రానికి లక్ష కోట్లు ఇచ్చామని అమిత్ షా గొప్పగా చెప్పుకోవడాన్ని కూడా ఓవైసీ తప్పు పట్టారు. ఏటా కేంద్రానికి వివిధ పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి రూ.50,000 కోట్లు చెల్లిస్తున్నాము. అదిగాక ఆదాయపన్ను ద్వారా మరో ఊ. 32,000 కోట్లు చెల్లిస్తున్నాము. దానితో పోలిస్తే కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నది ఎంత? సగం కూడా ఉండదు. కానీ అమిత్ షా ఏదో రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేస్తున్నట్లు మాట్లాడారు. తెలంగాణా రాష్ట్రం ఏమైనా బిచ్చం ఆడుకొంటోందా? మన ఫెడరల్ వ్యవస్థలో న్యాయంగా దానికి రావలసిన వాటానే కేంద్రం ఇస్తోంది తప్ప అదనంగా ఏమి ఇస్తోంది? తాము అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు కల్పిస్తామని భాజపా గొప్పలు చెప్పుకొంది. కానీ ఈ మూడేళ్ళలో కేవలం 2.03 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగింది. గోరక్షక్ పేరిట దేశంలో ముస్లింలపై దాడులు జరుగుతున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికలలో ప్రజలే దానికి గట్టిగా బుద్ధి చెపుతారు,” అని ఒవైసీ అన్నారు.