హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బుధవారం తెదేపా మహానాడు సభలో ప్రసగించిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణా రాష్ట్రంలో తెదేపా నేతలు, కార్యకర్తలు బొబ్బిలి పులులు..కొండవీటి సింహాలులాగ దూసుకుపోతున్నారని మెచ్చుకొన్నారు. ఆ రెండు పదాలు పౌరుషానికి ప్రతీకలుగా చెప్పుకోబడుతుంటాయని అందరికీ తెలుసు. అయితే తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న సభలో చంద్రబాబు నాయుడు అలవాటు ప్రకారం చెప్పిన ఆ పదాలలో బొబ్బిలి పట్టణం ఉత్తరాంధ్రాలోని విజయనగరం జిల్లాలో ఉండగా, కొండవీడు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ఒకవేళ ఇటువంటి సందర్భంలోనే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించినట్లయితే, ఆయన కాకతీయులతోనో మరోకరితోనో పోల్చి ఉండేవారు. కానీ చంద్రబాబు ఆంధ్రాకు చెందినవారు కనుక అలవాటు ప్రకారం బొబ్బిలి పులులు, కొండవీడు సింహాలతో తెలుగు తమ్ముళ్ళని పోల్చి చెప్పారు.
తెలంగాణాలో తెదేపా గురించి ఆయన ఇంకా ఏమన్నారంటే, “మన పార్టీ నాయకులు తయారుచేసుకొనే గొప్ప ఫ్యాక్టరీ వంటిది. కనుక ఎంతమంది నాయకులు పార్టీ విడిచివెళ్ళిపోయినా మనం కొత్త నాయకులను తయారుచేసుకొని మళ్ళీ పోరాటానికి సిద్దం కాగలము. ఆ సత్తా మనకు ఉంది కనుకనే ఎంతమంది వెళ్ళిపోయినా మనం చెక్కు చెదరలేదు. ఇక నుంచి తెలంగాణా రాష్ట్రంలో తెదేపాను బలోపేతం చేసుకొని మళ్ళీ పూర్వ వైభవం సాధించేందుకు నేను తెలంగాణా నేతలకు, కార్యకర్తలకు మరింత సమయం కేటాయించి మార్గదర్శనం చేస్తుంటాను. ఎవరికీ భయపడేది లేదు. మన పార్టీకి చరిత్ర సృష్టించే అలవాటు ఉంది. కనుక మళ్ళీ అందరం కలిసికట్టుగా పనిచేసి మరోసారి తెలంగాణాలో కూడా చరిత్ర సృష్టిద్దాం,” అని అన్నారు.
భాజపాతో సంబంధాల గురించి మాట్లాడుతూ “ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఈలోగా చాలా మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక పొత్తుల గురించి ఇప్పుడే ఆలోచించడం అనవసరం. కనుక పార్టీలో నేతలందరూ భాజపా విషయంలో తొందరపడి నోరు జారవద్దు,” అని చంద్రబాబు నాయుడు హితవు పలికారు.
ఈ సందర్భంగా తను హైదరాబాద్ అభివృద్ధి కోసం చేసిన కృషి గురించి మరొకసారి చెప్పుకొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో నెంబర్: 1 స్థానం సంపాదించుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
చంద్రబాబు తన ప్రసంగం ముగిస్తూ స్వయంగా జై తెలంగాణా అని నినదించడమే కాకుండా సభకు హాజరైనవారి చేత కూడా జై తెలంగాణా అని నినాదాలు చేయించడం విశేషం.