భారత్-పాక్ మధ్య మళ్ళీ యుద్ధవారణం ఏర్పడింది. భారత్ ఎంతగా వారిస్తున్నప్పటికీ పాక్ తన వైఖరిని మార్చుకోకుండా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ స్థానిక యువకులను అల్లర్లకు ప్రేరేపిస్తూనే ఉంది. నిత్యం భారత్ లోకి ఉగ్రవాదులను పంపిస్తూనే ఉంది. వారు భారత సైనికులనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటీవల సరిహద్దుల వద్ద పాక్ సైనికులు ఇద్దరు భారత్ జవాన్లపై దాడి చేసి వారి శరీరాలను ముక్కలుముక్కలుగా నరికి వారి తలలును శరీరాల నుంచి వేరు చేసి భారత్ ను మళ్ళీ రెచ్చగొట్టారు.
గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగితే వాటిని ఖండించి ఊరుకోనేవారు. కానీ మోడీ సర్కార్ చేతలకు చేతలతోనే సమాధానాలు చెపుతోంది. ఈ సంగతి తెలిసికూడా పాక్ తన దుశ్చర్యలను మానుకోలేదు. భారత్ ను కవ్వించడం మానుకోలేదు. తత్ఫలితంగానే భారత్ ఆర్మీ సరిహద్దుల వెంబడి పాక్ భూభాగంలో గల పాక్ బంకర్లపై బాంబుల వర్షం కురిపించి నాశనం చేశారు. ఉగ్రవాదులను భారత్ లో ప్రవేశించనీయకుండా అడ్డుకోనేందుకే తాము దాడి చేసినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు.
భారత్ చర్యను అమెరికా సైతం సమర్ధించింది. కానీ అసలు అటువంటి దాడులు ఏవీ జరగనేలేదని వాదించిన పాకిస్తాన్ సియాచిన్ సమీపంలో యుద్ద విమానాలను మోహరించడం విడ్డూరంగా ఉంది. పాకిస్థాన్ వాయుసేన అధిపతి సొహైల్ అమన్ నిన్న సరిహద్దుకు అతిసమీపంలో పాక్ భూభాగంలో గల ఖాద్రి వైమానిక స్థావరానికి వచ్చి పాక్ వాయుసేన విన్యాసాలను చూసి వెళ్ళారు.
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషించడం మానుకొని దానిని తుదముట్టించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాక్ ను హెచ్చరించడమే కాకుండా ఏటా పాకిస్తాన్ కు ఇస్తున్న కోట్ల డాలర్ల ఆర్ధిక సహాయంలో కోత విదించి, మిగిలినదానిని అప్పుగా మార్చేరు. ఇటీవల సౌదీ పర్యటనలో ‘భారత్ ఉగ్రవాద పీడితదేశమని’ చెప్పి దానికి పాకిస్తానే కారణమని చెప్పకనే చెప్పారు. ఆలాగే కులభూషణ్ జాదవ్ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం పాక్ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. కనుక పాక్ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ కొంత హడావుడి చేసిన తరువాత ఈ పరిస్థితులను అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని వెనక్కు తగ్గవచ్చు. కానీ భారత్ ను అస్థిరపరిచే ప్రయత్నాలు మాత్రం ఆపదని ఖచ్చితంగా చెప్పవచ్చు.