తెలంగాణాకు లక్ష కోట్లు ఇచ్చాము..లెక్కలున్నాయి

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం తెలంగాణా పర్యటన ముగింపు సందర్భంగా తనపై తెరాస నేతలు చేస్తున్న విమర్శలకు బదులిస్తూ, “తెలంగాణా రాష్ట్రానికి రూ.96,406 కోట్లు పైనే ఇచ్చాము. నేను ఈ ఈ మాటలు ఊరికే చెప్పడం లేదు. పూర్తి వివరాలతోనే రాష్ట్రానికి వచ్చి మాట్లాడుతున్నాను. వాటికి మా దగ్గిర పూర్తి లెక్కలున్నాయి. అదికాక అదనంగా మరో రూ.12,000 కోట్లు కూడా ఇచ్చాము. రాష్ట్రానికి ఇంత బారీగా నిధులు అందిస్తున్నా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని తెరాస నేతలు వాదించడం, నేను చెపుతున్న వివరాలు అబద్దమని నన్ను విమర్శించడం సరికాదు.

గత 7 దశాబ్దాలలో సాధ్యం కానివన్నీ ఈ మూడేళ్ళ కాలంలో ఎలా పూర్తయ్యాయి? వాటికి కేంద్రం సహాయసహకారాలు అందిస్తున్న మాట వాస్తవం కాదా? తెలంగాణా రాష్ట్రంలో ఎయిమ్స్, హార్టికల్చర్, గిరిజన, వెటర్నరీ యూనివర్సిటీలను ఏర్పాటు చేయబోతున్నాము. ఈ సంగతి నన్ను విమర్శిస్తున్న వారికి తెలియదా? గతంలో ఏ ప్రభుత్వాలు చేయనంతగా మా ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తోంది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే విధానంతో దేశంలో అన్ని రాష్ట్రాలను కలుపుకొని పోతూ మా ప్రభుత్వం పని చేస్తోంది. మోడీ పాలనను చూసి యావత్ దేశప్రజలు భాజపావైపే చూస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 13 రాష్ట్రాలలో భాజపా అధికారంలో ఉంది. మున్ముందు తెలంగాణా రాష్ట్రంలో కూడా భాజపా ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది,” అని అమిత్ షా అన్నారు.