అంతవరకు రాష్ట్ర విభజన జరగనట్లే లెక్క: కేసీఆర్

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అమిత్ షా నల్గొండ పర్యటనలో సందర్భంగా తెరాస సర్కార్ పై చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బదులిస్తూ “మూడేళ్ళు గడిచినా ఇంతవరకు విభజన చట్టంలో ఉన్న ఒక్క హామీని కూడా కేంద్రప్రభుత్వం నెరవేర్చలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ప్రోత్సహించేందుకు ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేకపోయింది. పైగా రాష్ట్రంలో 7మండలాలను ఏపిలో కలిపి తెలంగాణా పట్ల అత్యంత అవమానకరంగా వ్యవహరించింది. మూడేళ్ళు గడిచినా ఇంతవరకు కనీసం హైకోర్టు విభజన చేయలేదు. హైకోర్టు కోసం మన న్యాయవాదులు, జడ్జీలు రోడ్లేక్కి ఆందోళనలు చేశారు. హైకోర్టు విభజన కోసం మా ఎంపిలు కలవని వ్యక్తి లేడు. అందరినీ బ్రతిమాలుకొంటూనే ఉన్నాము. నేను డిల్లీ వెళ్ళినప్పుడల్లా ఇదే విషయం ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్రమంత్రులకు, వీలైనప్పుడల్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గుర్తిచేసి హైకోర్టు విభజనకు సహకరించమని అడుగుతుంటాను. కానీ మేము హైకోర్టు విభజన గురించి అడిగితే డిల్లీ పెద్దలు ‘హైకోర్టు మీ హైదరాబాద్ లోనే ఉంది కదా?’ అని వెటకారంగా మాట్లాడుతుంటారు. హైకోర్టు హైదరాబాద్ లోనే ఉందనే సంగతి కేంద్రమంత్రులో, అమిత్ షానో చెపితేగానీ మాకు తెలియదా? ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే తెలంగాణా రాష్ట్రం పట్ల కేంద్రం ఏవిధంగా వ్యవహరిస్తోందో ప్రజలకు తెలియజెప్పడానికే. న్యాయవ్యవస్థను కూడా విభజిస్తే గానీ రాష్ట్ర విభజన పూర్తయినట్లు నేను భావించను. కానీ అది ఇంకా ఎప్పటికి జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయి.”

“తెలంగాణా రాష్ట్రానికి ఈ చిన్న సహాయం కూడా చేయలేని భాజపా నేతలు రాష్ట్రానికి మేమేదో అన్యాయం చేసేస్తున్నట్లు వారే కాపడాలన్నట్లు మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళు రాష్ట్రానికి ఏమి చేశారని ప్రజలను ఓట్లు వేయమని అడుగుతున్నారు? అమిత్ షా జాతీయ స్థాయి నాయకుడు. అయన రాష్ట్రానికి వచ్చినప్పుడు తన పనేదో తను చూసుకొని వెళ్ళిపోతే గౌరవంగా ఉండేది. కానీ నోటికి వచ్చినట్లు అబద్దాలు మాట్లాడి మా ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోము. భాజపా నేతలు ఇదేవిధంగా మాట్లాడుతుంటే ఇప్పుడు వారికున్న 5 సీట్లు కూడా పోగొట్టుకొంటారు. వచ్చే ఎన్నికలలో వారికి సింగిల్ డిజిట్ కే పరిమితం కాబోతున్నారని తాజా సర్వేలో తేల్చి చెప్పింది. కనుక ఇకనైనా భాజపా నేతలు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే వారికే మంచిది,” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.