తెదేపా వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెదేపా ప్రతీ ఏటా మహానాడు సభలు నిర్వహించుకొంటుంది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ఈసారి రాష్ట్రంలోని తెదేపా నేతలు రాష్ట్ర స్థాయిలోనే మహానాడు సభను నిర్వహించుకోవాలని నిర్ణయించారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బుధవారం తెదేపా మహానాడు సభ జరుగుతుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఆ సభలో పాల్గొని ఉపన్యసించబోతున్నారని ఆ పార్టీ నేతలు తెలియజేశారు.
ఈరోజు జరుగబోయే మహానాడులో ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిపై తెదేపా అభిప్రాయాలు లేదా వైఖరిని తెలియజేస్తూ మొత్తం 8 తీర్మానాలపై చర్చించి ఆమోదిస్తామని తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి తెలిపారు. విద్యార్ధులు, నిరుద్యోగుల సమస్యలు, ఆరోగ్యం, వైద్య రంగం, నీటిపారుదల, కుల, చేతి వృత్తులు, సామాజిక న్యాయం, తెరాస సర్కార్ వైఫల్యాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, భాజపాతో భవిష్యత్ లో అనుసరించవలసిన వైఖరి మొదలైన అంశాలపై పెడుతున్న తీర్మానాలను ఈరోజు మహానాడు సభలో చర్చించి ఆమోదిస్తామని తెలిపారు.