ధర్నా చౌక్ పరిరక్షణ సమితి కన్వీనర్ చాడ వెంకట రెడ్డి అధ్యక్షతన నిన్న హైదరాబాద్ లోని మఖ్దూం భవన్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న వామపక్షాలు, ప్రజా సంఘాలు ధర్నా చౌక్ కోసం మళ్ళీ ఉద్యమాలు ప్రారంభించాలని నిర్ణయించాయి. ముందుగా ఈనెల 28వ తేదీన ధర్నా చౌక్ పరిసర ప్రాంతాలలో పాదయాత్రలు చేసి స్థానికులను చైతన్యపరిచి వారి మద్దతు కోరడం, తరువాత వచ్చే నెలలో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే జూలై నెలలో డిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. ధర్నా చౌక్ ను కాపాడుకోవడం కోసం కూడా ఇన్ని పోరాటాలు చేయవలసిరావడం చాలా దురదృష్టకరమని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయం మార్చుకొంటే గౌరవంగా ఉంటుందని అన్నారు. లేకుంటే ధర్నా చౌక్ కాపాడుకొనేందుకు ఎంత కాలమైనా పోరాటాలు కొనసాగిస్తామని ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు.