ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది తమిళ రాజకీయాల పరిస్థితి. రజనీకాంత్ (దేవుడు శాశిస్తే) రాజకీయాలలోకి వస్తానని ఎప్పుడూ చెపుతూనే ఉన్నారు. మొన్న తన అభిమానులతో సమావేశం అయినప్పుడు కూడా మళ్ళీ అదే చెప్పారు. కానీ ఎప్పుడైనా యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి అందరూ సిద్దంగా ఉండాలని చెప్పిన ఒక్క ముక్కతో అయన త్వరలో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నారనే ఊహాగానాలు మొదలైపోయాయి. అవి చూసి అప్రమత్తమైన ఒక రాజకీయ పార్టీ కన్నడిగుడైన రజనీకాంత్ తమిళరాజకీయాలలోకి ప్రవేశించడానికి వీలులేదంటూ ఆయన ఇంటి ముందు ఆందోళన కార్యక్రమాలు చేశారు.
అది చూసి ఆగ్రహం చెందిన రజనీ అభిమానులు, ఆయన తక్షణమే రాజకీయాలలోకి రావాలని కోరుతూ మంగళవారం చెన్నైలో ఊరేగింపు నిర్వహించారు. ఇంతవరకు తమిళనాడులో అందరూ ఆయనను ఆదరించేవారు. గౌరవించేవారు. రజనీకాంత్ ఎప్పటికైనా రాజకీయాలలోకి వస్తారో లేదో తెలియదు కానీ ఆ ఆలోచన చేయగానే ఆయనకు అనుకూల, వ్యతిరేక వర్గాలు తయారైపోయాయి. నిజంగా రాజకీయాలలోకి ప్రవేశిస్తే ఇంకా ఎంత మంది కొత్త శత్రువులు పుట్టుకువస్తారో? కనుక రజనీకాంత్ దేవుడు శాశించేవరకు వేచి చూడటమే మంచిది.