భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిన్నటి నుంచి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, పదాతికారులతో నిన్న సాయంత్రం సమావేశమైనప్పుడు, పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి మరింత క్రియాశీలంగా పనిచేయాలని చెప్పారు. కేంద్రప్రభుత్వం స్వచ్చాభారత్ పధకం క్రింద మరుగుదొడ్లు నిర్మానికి బారీగా నిధులు అందజేస్తున్నా తెరేట్ పల్లి గ్రామంలో చాలా ఇళ్ళకు మరుగుదొడ్లు లేకపోవడం గమనిస్తే, కేంద్రప్రభుత్వ పధకాలు రాష్ట్రంలో సమర్ధంగా అమలుకావడం లేదని స్పష్టం అవుతోందని అన్నారు. ఇటువంటి అంశాలపై రాష్ట్ర భాజపా నేతలు తెరాస సర్కార్ ను గట్టిగా నిలదీయాలని అమిత్ షా సూచించారు.
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్, మూడేళ్ళు పూర్తవుతున్నా ఇంతవరకు ఆ పని చేయలేదు కానీ తన కోసం విలాసవంతమైన ఇంటిని కట్టుకొన్నారని, ఇటువంటి అంశాలు లేవనెత్తుతూ ప్రజా సమస్యలపై తెరాస సర్కార్ తో గట్టిగా పోరాటం చేయాలని అమిత్ షా సూచించారు.
ఇక నుంచి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా చేసుకొని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో భాజపా తప్పకుండా అధికారంలోకి తీసుకువచ్చేందుకు తను కూడా ఇక నుంచి తెలంగాణా రాష్ట్రంపైనే ఎక్కువ దృష్టి సారిస్తానని అమిత్ షా చెప్పారు. ఇక నుంచి ప్రతీ మూడు నెలలకు ఒకసారి రాష్ట్ర పర్యటనకు వస్తానని చెప్పారు. సెప్టెంబర్ నెలలో పర్యటించినప్పుడు రాష్ట్రంలోనే 6 రోజులు ఉండి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అమిత్ షా చెప్పారు. ఈలోగా రాష్ట్ర భాజపా నేతలు కూడా తమ పనితీరును మరింత మెరుగుపరుచుకొని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు గట్టిగా కృషి చేయాలని అమిత్ షా చెప్పారు.