నేటి నుంచే అమిత్ షా రాష్ట్ర పర్యటన

దక్షిణాది రాష్ట్రాలలో భాజపా అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న రాష్ట్రంగా తెలంగాణా అని భావిస్తున్నామని రాష్ట్ర భాజపా నేతలు పదేపదే చెపుతున్నారు. రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేసుకొనేందుకు వివిధ పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకొంటామని చెపుతున్నారు. ఇక నుంచి 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతామని కె.లక్ష్మణ్ చెప్పారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించడానికి వస్తున్నారు.

ఆయన ఈరోజు మధాహ్నం ఒంటి గంటకు నల్లగొండ జిల్లా చేరుకొని అక్కడ అనేక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం గుండగోని దళితబస్తీలో సహపంక్తి భోజనం చేస్తారు. సాయంత్రం స్థానిక హోటల్ లో పార్టీ నేతలు, స్థానిక ప్రముఖులతో సమావేశం అవుతారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకొంటామని రాష్ట్ర భాజపా నేతలు చెపుతున్నారు కనుక ఈ సమావేశంలో ఆయన కాంగ్రెస్, తెదేపాలకు చెందిన నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉందని భావించవచ్చు. ముఖ్యంగా జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులు భాజపాలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తుంనందున వారితో అమిత్ షా సమావేశం కావచ్చు. రేపు ఉదయం జిల్లాలో వెలుగుపల్లి, నాగార్జునసాగర్ పరిధిలోని దేవులపల్లి గ్రామాలలో అమిత్ షా పర్యటిస్తారు. అక్కడ ఆయన ఇంటింటికీ వెళ్ళి ప్రజలను కలిసి కేంద్రప్రభుత్వం వారి గ్రామంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలుగురించి అడిగి తెలుసుకొంటారు. మంగళవారం సాయంత్రం నల్లగొండ పట్టణంలో భాజపా నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం అవుతారు. రేపు రాత్రి పట్టణంలోనే బస చేస్తారు. 

బుధవారం ఉదయం జిల్లాలో నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోగల గుండ్రాoపల్లి గ్రామంలో పర్యటిస్తారు. అక్కడ ఒకప్పుడు రజాకార్ల చేతిలో హతులైన వారి కుటుంబాలను కలుస్తారు. ఆ సందర్భంగా అక్కడి భాజపా కార్యకర్తలు, గ్రామస్థులతో అమిత్ షా మాట్లాడుతారు. తరువాత భువనగిరిలో పర్యటించి అక్కడ పార్టీ సీనియర్ నేతలు, మేధావులు, ప్రముఖులతో సమావేశం అవుతారు. సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ చేరుకొని మొహిదీపట్నంలో గల క్రిస్టల్ గార్డెన్స్ లో హైదరాబాద్ లోక్ సభ పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం అవుతారు. బుధవారం రాత్రి బేగంపేటలో గల హరితప్లాజాలో బస చేస్తారు. మరునాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమిత్ షా పర్యటణ మొదలవుతుంది. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్డు మార్గం ద్వారా బయలుదేరుతారు.