ముఖ్యమంత్రి కేసీఆర్ ఔదార్యం

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలతో చాలా కటినంగా వ్యవహరిస్తుండటం చూసి ఆయన గురించి చాలా మందికి అపోహలు ఏర్పడి ఉండవచ్చు. కానీ తను అభిమానించేవారి కోసం ముఖ్యమంత్రి హోదాను సైతం పక్కనపెట్టి చాలా మానవత్వంతో వ్యవహరిస్తుంటారు. ఇదివరకు సవతితల్లి చేతిలో హింసించబడిన ప్రత్యూష విషయం ఒకసారి అది రుజువు అయ్యింది. ఆమెను దత్తత తీసుకొని ఆదరించారు. ఇప్పుడు మళ్ళీ ఆయనలో మానవీయ కోణాన్ని చూసే అవకాశం మళ్ళీ కలిగింది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరుకు చెందిన సతీష్ గత 12 సం.లుగా ఆయనకు వ్యక్తిగత సహాయకుడుగా పనిచేస్తున్నాడు. అతనికి హైదరాబాద్ కు చెందిన శిరీషతో నిన్న వివాహం జరిగింది. విశేషం ఏమిటంటే, ఆ కార్యక్రమం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ లోనే జరిగింది. కేసీఆర్, ఆయన  అర్ధాంగి, కుమార్తె కవిత వారి కుటుంబ సభ్యులు అందరూ వారి వివాహా కార్యక్రమాలను భుజాన్న వేసుకొని స్వయంగా జరిపించారు. ముఖ్యమంత్రే స్వయంగా అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకొని జరిపిస్తుండటంతో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో సహా అనేక మంది మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు తదితరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడమే కాకుండా అందరూ పెళ్ళి పనులను భుజాన్న వేసుకొని జరిపించారు. అది చూసి సతీష్, శిరీష వారి కుటుంబ సభ్యులు ఆనందంతో పొంగిపోయారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు నవదంపతులకు 12 తులాల బంగారు ఆభరణాలు, వారికి ఒక్క కొత్త ఫ్లాట్ (ఇల్లు) బహుకరించారు. ఇక మిగిలిన వారు సరేసరి. అనేక విలువైన బహుమతులు అందజేశారు. ఒక చిన్న ఉద్యోగి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇంత ఔదార్యం చూపించడం చాలా అభినందనీయం.