మేము రాక్షసులమైతే మా వాళ్ళని ఎందుకు చేర్చుకొంటున్నారు?

నల్లగొండ జిల్లా కేంద్రంలో బొత్తాయి మార్కెట్ శంఖు స్థాపన సందర్భంగా కాంగ్రెస్, తెరాస శ్రేణుల మద్య జరిగిణ ఘర్షణలతో రెండు పార్టీల మద్య మొదలైన యుద్ధం క్రమంగా చల్లారకపోగా ఇంకా వేడెక్కుతూనే ఉండటం విశేషం. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ నేతలు అందరూ అండగా నిలబడి తెరాసపై విరుచుకు పడుతుండటంతో, తెరాస నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు.

కోమటిరెడ్డికి మద్దతుగా మాట్లాడటం అంటే రౌడీయిజంను సమర్దిస్తున్నట్లేనని తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ గత చరిత్ర తవ్విపోసి ఇందిరాగాంధీ హత్య తరువాత ఆ పార్టీ నేతలు డిల్లీలో సిక్కులను ఏవిధంగా ఊచకోత కోసారో, ఆ తరువాత రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు తమిళులపై ఏవిధంగా దాడులు చేశారో గుర్తు చేసి కాంగ్రెస్ నేతలు నరరూప రాక్షసులని తేల్చి చెప్పారు. ముదిగొండలో రైతులను కూడా కాంగ్రెస్ పార్టీయే పొట్టనపెట్టుకొందని ఆరోపించారు. ఆ కాంగ్రెస్ రాక్షస సంస్కృతినే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోమారు బయటపెట్టుకొన్నారని ఆరోపించారు.

ఇంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం చిక్కినప్పుడల్లా కాంగ్రెస్ నేతలను ఉద్దేశ్యించి దద్దమ్మలు, సన్నాసులు అంటూ చులకనగా మాట్లాడటం అప్పుడు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెపుతుండటం పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మరో అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ నేతలను నరరూప రాక్షసులనడంతో సీనియర్ నేత వి హనుమంతరావు భగ్గుమన్నారు.

“మేము నరరూప రాక్షసులమైతే మా పార్టీలో నేతలను మీ పార్టీలో ఎందుకు చేర్చుకొన్నారు?మా కేశవరావు చేత మీ పార్టీ మ్యానిఫెస్టో ఎందుకు వ్రాయించుకొన్నారు?మాపార్టీలో నేతలను మీ పక్కనే ఉంచుకొని మళ్ళీ మా పార్టీని నిందిస్తుంటారు. తెరాస నేతలు మా గురించి అన్న మాటలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి. అధికారంలో ఉన్నాము కదాని మరీ అంతగా రెచ్చిపోవద్దు. నోటిని అదుపులు పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోండి. లేకుంటే ఇక ఎంత మాత్రం సహించబోము,” అని గట్టిగా హెచ్చరించారు.