
ఇంతకాలంగా మన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు, పరిశ్రమలను రప్పించేందుకు ప్రయత్నిస్తుండటం చూశాము. కానీ మొదటిసారిగా వియత్నాం దేశం తెలంగాణా పారిశ్రామికవేత్తలని ముఖ్యంగా ఐటి రంగంలో ఉన్నవారిని తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని అభ్యర్దిస్తోంది. భారత్ లో వియత్నాం రాయబారి టన్ సిన్హ్ థాన్ శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు, మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రం ఐటి రంగంలో చాలా అభివృద్ధి సాధించింది. మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడం సాధ్యం అవుతుందో లేదో పరిశీలిస్తాము. కానీ ఇక్కడి ఐటి సంస్థలు, పారిశ్రామికవేత్తలు మా దేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టాలని కోరుతున్నాను. ముఖ్యంగా తెలంగాణా ఐటి నైపుణ్యం మాకు చాలా అవసరం ఉంది. కనుక ఐటి సంస్థలు స్థాపించవలసిందిగా నేను కోరుతున్నాను,” అని అన్నారు.