ఛార్ ధామ్ యాత్ర పునః ప్రారంభం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలీ జిల్లాలో విష్ణు ప్రయాగ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో రిషికేశ్-బద్రీనాద్ మార్గంలో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి సుమారు 2,000 మంది ప్రయాణికులు ముందుకు వెనక్కు గానీ వెళ్ళలేని పరిస్థితిలో చిక్కుకొన్నారు. రిషికేశ్-బద్రీనాద్ జాతీయ రహదారిలో హాదీ పహాడ్ అనే ప్రాంతంలో ఉన్న కొండపై నుంచి శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా పెద్ద పెద్ద బండరాళ్ళు దొర్లిపడటం మొదలయ్యాయి. వాటితో రహదారి మొత్తం మూసుకుపోయింది.

ఈ విషయం తెలియగానే అధికారులు, పారా మిలటరీ దళాలు అక్కడికి చేరుకొని సహాయచర్యలు చేపడుతున్నారు. మరోపక్క బండరాళ్ళను తొలగించే కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. కొండపై నుంచి బండరాళ్ళు క్రిందకు దొర్లి పడుతుండటం చూసి రహదారి భద్రతా సిబ్బంది వాహనాలను దూరంగా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.  శనివారం సాయంత్రంలోగా రాళ్ళను తొలగించే పని పూర్తయి మళ్ళీ వాహనాల రాకపోకలు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే సుమారు 800 మంది ప్రయాణికులు ముందుకు సాగుతున్నారు. కర్ణ ప్రయాగ, గోవింద్ ఘాట్, బద్రీనాద్, జోషీమఠ్ పీపల్ కోటి, తదితర క్షేత్రాలలో సుమారు 1500మందికి పైగా యాత్రికులు నిలిచిపోయారు. వారు కూడా మరికొద్ది సేపటిలో తమ యాత్రను ప్రారంభించడానికి సిద్దం అవుతున్నారు.