
ప్రస్తుతం రక్షణశాఖ అధీనంలో ఉన్న సికిందరాబాద్ లోని బైసన్ పోలో, జింఖాన మైదానాలను తెలంగాణా ప్రభుత్వానికి ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ లో నూతన సచివాలయం నిర్మించాలని భావిస్తున్నారు. కానీ ప్రజలు ఉపయోగించుకొంటున్న ఆ మైదానాలలో సచివాలయం నిర్మించవద్దని కోరుతూ స్థానికులు, వాకర్స్ క్లబ్ సభ్యులు శనివారం పెరేడ్ గ్రౌండ్స్ లో ఆందోళన చేపట్టారు. వారికి కాంగ్రెస్ నేతలు మద్దతు పలుకుతూ మానవహారం ఏర్పడ్డారు. అక్కడ సచివాలయం నిర్మించాలనే నిర్ణయాన్ని తెలంగాణా ప్రభుత్వం తక్షణం వెనక్కు తీసుకోవాలని, నగరం నడిబొడ్డున ఆ మైదానాలను ప్రజలు వినియోగించుకోవడానికి విడిచిపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట ఎర్రగడ్డ వద్ద ప్రభుత్వాసుపత్రులను తరలించి అక్కడ 10 అంతస్తులతో కూడిన నూతన సచివాలయాన్ని నిర్మించాలనుకొన్నారు. కానీ ప్రతిపక్షాలు అడ్డుపడటంతో వెనక్కు తగ్గారు. తరువాత ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చి వేసి అక్కడే కొత్తది కడదామనుకొన్నారు. కానీ వాటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో ఉన్న కొన్ని భవనాలను అప్పజెప్పేందుకు చంద్రబాబు నాయుడు అంగీకరించకపోవడంతో, ఈ రక్షణశాఖ మైదానంలో నిర్మించాలనుకొన్నారు. అతికష్టం మీద కేంద్రప్రభుత్వాన్ని, రక్షణశాఖ అధికారులను ఒప్పించగలిగారు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ సమస్య మొదలైంది.
కాంగ్రెస్ నేతలు ప్రోద్బలంతోనే స్థానికులు ఈ ఆందోళన మొదలుపెట్టారా లేక వారు ఆందోళన మొదలుపెట్టిన తరువాత కాంగ్రెస్ నేతలు వచ్చి కలిశారా? అనే అనుమానామ్ కలుగుతోంది. ఏమైనప్పటికీ, కాంగ్రెస్ నేతలు వచ్చి కలిసినందున దీనికి కూడా రాజకీయ రంగు పులిమినట్లు అయ్యింది. కనుక దీనిపై కూడా తెరాస ఒకటీ ఒకవైపు, కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలన్నీ మరోవైపు నిలిచి త్వరలోనే పోరాడుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.