
ఈనెల 24వ తేదీన హైదరాబాద్ లో మహానాడు సభ జరుగబోతోంది. దాని ఏర్పాట్ల గురించి చర్చించడానికి సమావేశమైన తెలంగాణా తెదేపా అధ్యక్షుడు రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు తదితర తెదేపా నేతలు, అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సచివాలయం నుంచే పాలన సాగిస్తుంటారు. కానీ సచివాలయంలో అడుగుపెట్టకుండా రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆరే. అయన కొత్తగా కట్టుకొన్న తన విలాసవంతమైన ప్రగతి భవన్ లో నుంచి కాలు బయట పెట్టకుండా అక్కడి నుంచే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం ఉన్న సచివాలయానికి చాలా వాస్తుదోషాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా నమ్ముతునందునే కొత్త సచివాలయం నిర్మించాలనుకొంటున్నారు. కనుక అందుకే ఆయన అందులో అడుగు పెట్టడానికి ఇష్టపడక వాస్తు ప్రకారం నిర్మించుకొన్న ప్రగతి భవన్ లో నుంచే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని భావించవచ్చు. కనుక రక్షణశాఖ ఇవ్వబోతున్న సికిందరాబాద్ లోని బైసన్ పోలో, జింఖాన గ్రౌండ్స్ లో నూతన సచివాలయం నిర్మించుకొని దానిలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుపెట్టవచ్చు.