
వివిధ కారాణాల చేత భర్తకు, కుటుంబాలకు దూరమై దుర్భర జీవితం అనుభవిస్తున్న ఒంటరి మహిళల గురించి ఇంతవరకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సమస్యలను గుర్తించి వారికి కూడా నెలకు రూ.1,000 చొప్పున పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి రాష్ట్రంలో ఒంటరి మహిళలకు పెన్షన్లు అందించడానికి శరవేగంగా ఏర్పట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వేలాది మంది ఒంటరి మహిళలు తమ పేర్లను సంబంధిత అధికారుల వద్ద నమోదు చేయించుకొన్నారు. నేటితో పేర్లు నమోదు చేసుకొనేందుకు గడువు ముగుస్తుంది.
ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,720 మంది ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకొన్నారు. వారిలో మీ-సేవా ద్వారా 3,782 మంది నేరుగా మండల కేంద్రాలలో 1,938 మంది దరఖాస్తులు చేసుకొన్నారు. వారిలో 1,751 మంది మాత్రమే అర్హులుగా గుర్తించారు. తెరాస సర్కార్ చేసిన ఈ ఆలోచన చాలా అభినందనీయమే కానీ ఒంటరి మహిళల నమోదుకు నిర్దిష్ట గడువు నిర్ణయించడమే సమంజసంగా లేదు. ఎందుకంటే, ఇది నిరంతరంగా ఏర్పడే ఒక సామాజిక సమస్య. కనుక అటువంటి నిస్సహాయ మహిళలు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని అందుకొనేందుకు గడువు విదించడం సరికాదు. ఈ సహాయం అవసరమైనవారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పిస్తే వారు సంతోషిస్తారు.