
హైదరాబాద్ లో తిరుగుతున్న వాహనాలకు ఏదో భూతం ఆవహించినట్లు నిత్యం ఎక్కడో అక్కడ ఓ వాహనం రోడ్డు మద్యన ఉండే మెట్రో రైల్ పిల్లర్లను గుద్దుకొని ప్రమాదానికి గురవుతున్నాయి. మంత్రి నారాయణ కుమారుడు నితీష్ నారాయణ కారు ప్రమాదంతో మొదలైన ఈ విషాదకర సంఘటనలు వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదం జరిగిన నాలుగైదు రోజులకే మళ్ళీ మే15న హైదరాబాద్ నగర పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ఎల్.బి.నగర్ లో మెట్రో పిల్లర్ ను డ్డీ కొంది కానీ ఆయన తన వాహనాన్ని పరిమిత వేగంతోనే నడుపుతున్నందున అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. మళ్ళీ ఈరోజు తెల్లవారుజామున అదే ప్రాంతంలో అదే విధమైన మరో ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ కు కట్టెల లోడుతో వస్తున్న ఒక డి.సి.ఎం.వాహనం శనివారం తెల్లవారుజామున ఎల్.బి.నగర్ వద్ద మెట్రో పిల్లర్ ను బలంగా డ్డీ కొనడంతో దాని డ్రైవర్ సర్దార్ మృతి చెందాడు. అతను కృష్ణాజిల్లాలోని జగ్గంపేటకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
మెట్రో పిల్లర్లను వాహనాలు గుద్దుకోవడం వలన ప్రమాదాలు జరిగి వాటిలో వాహనదారులు చనిపోవడమే కాకుండా, మెట్రో పిల్లర్ల పటిష్టత దెబ్బ తింటే వాటిపైన నడిచే మెట్రో రైల్ కు, దానిలో ప్రయాణికులకు కూడా ప్రమాదం ఏర్పడవచ్చు. సాధారణంగా ఇటువంటి ప్రమాదాలన్నీ రాత్రి పూటే జరుగుతున్నాయి కనుక మెట్రో పిల్లర్లకు చీకటిలో మెరిసే రేడియం కలర్స్ వేయడం వంటి రక్షణ చర్యలు తీసుకొంటే ప్రమాదాలు నివారించవచ్చు.