పశ్చిమ బెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ సుప్రీంకోర్టుతో గొడవపడి, ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులకే జైలు శిక్షలు, జరిమానాలు విధించిన ఘనుడు. ఒక న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి కోర్టు ధిక్కారానికి పాల్పడితే దాని పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో తెలిసి కూడా సుప్రీంకోర్టును ధిక్కరించి కష్టాలలో పడ్డారు.
సుప్రీంకోర్టు ఆయనకు 6 నెలలు జైలు శిక్ష విధించడంతో అజ్ఞాతంలోకి వెళ్ళి మరో పొరపాటు చేశారు. శిక్ష పడిన తరువాత అయిన పశ్చాతాపం వ్యక్తం చేసి ఉండి ఉంటే సుప్రీంకోర్టు కనికరించి ఉండేదేమో? కానీ అజ్ఞాతంలో ఉంటూ తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయమని తన న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకొన్నారు. కానీ ఆయన అభ్యర్ధనను కోర్టు తిరస్కరించడంతో ఆఖరి మార్గంగా తన న్యాయవాదుల ద్వారా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకొన్నారు.
రాజ్యాంగంలోని 72వ అధికరణం ప్రకారం రాష్ట్రపతికి ఎవరి శిక్షలైన రద్దు చేసేందుకు, తగ్గించేందుకు అధికారాలు ఉంటాయి. దాని ప్రకారం తనకు సుప్రీంకోర్టు విదించిన 6 నెలల జైలు శిక్ష రద్దు చేయాలని జస్టిస్ కర్ణన్ తన క్షమాభిక్ష పిటిషన్ లో కోరారు. ఆయనను రాష్ట్రపతి క్షమించవచ్చు లేదా ఆయన దరఖాస్తును తిరస్కరించవచ్చు. అది వేరే సంగతి. కానీ సాధారణంగా ఉరిశిక్ష పడిన నేరస్తులు, ఉగ్రవాదులు లేదా జైలు శిక్ష అనుభవిస్తూ తీవ్ర అనారోగ్యం పాలైన ఖైదీలు మాత్రమే రాష్ట్రపతికి ఇటువంటి అభ్యర్ధనలు చేసుకొంటారు. ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఈవిధంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.
ఇది స్వయంకృతాపరాధమే. కనుక జస్టిస్ కర్ణన్ ఎవరినీ నిందించనవసరం లేదు. కనీసం ఇప్పటికైనా ఆయన ధైర్యంగా సుప్రీంకోర్టు వద్దకు వెళ్ళి తన తప్పును ఒప్పుకొని క్షమించమని కోరుకొంటే మంచిది. ఒక న్యాయమూర్తి అహంకారంతోనో లేదా మానసిక వైకల్యంతోనో చేసిన తప్పు వలన ఇటువంటి దుస్థితి ఎదుర్కోవలసిరావడం మన న్యాయవ్యవస్థకు గౌరవం కాదు కనుక సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనే అవకాశం ఉంటుంది.