ఇవ్వాళ్ళ ఒకే రోజున ఇద్దరు ప్రముఖులు మృతి చెందారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే (61), ప్రముఖ బాలీవుడ్ నటి రీమాలగూ (59) ఇద్దరూ కూడా గుండెపోటుతోనే ఈరోజు మృతి చెందారు.
మంత్రి అనిల్ మాధవ్ దవే ఈరోజు ఉదయం డిల్లీలో మృతి చెందారు. ఆయనతో నిన్న సాయంత్రమే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలపై చాలాసేపు మాట్లాడానని, ఇంతలోనే ఆయన మృతి చెందినట్లు విని దిగ్బ్రాంతి చెందానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఒక సన్నిహితుడిని కోల్పోయానని మోడీ ట్వీట్ చేశారు.
మధ్యప్రదేశ్ కు చెందిన అనిల్ మాధవ్ దవే 2009 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉంటున్నారు. గత ఏడాది జూలై 5న కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మోడీకి చాలా సన్నిహితుడు.
మహారాష్ట్రకు చెందిన బాలీవుడ్ నటి రీమాలగూ మరాఠీ నాటక రంగం నుంచి హిందీ టీవి సీరియల్స్ లోకి అక్కడి నుంచి హిందీ సినీ రంగంలో ప్రవేశించి అనేక సినిమాలు మంచి నటిగా గుర్తింపు పొందారు. ఆమె తల్లి మందాకినీ కూడా మంచి స్టేజ్ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకొన్నవారే. హిందీ సినిమాలలో తల్లి పాత్ర అంటే టక్కున గుర్తుకు వచ్చేది రీమాలాగు అంటే అతిశయోక్తి కాదు. ఆమె సంజయ్ దత్త్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, గోవిందా, జూహి చావ్లా మొదలైన అనేక మంది ప్రముఖనటీనటులకు తల్లిగా నటించారు. మైనే ప్యార్‌కియా, సాజన్, హమ్ ఆప్ కే హై కౌన్, హె దిల్లగీ, దిల్ వాలే, కుచ్ కుచ్ హోతాహై, కల్ హో నాహో వంటి అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించి అందరినీ మెప్పించారు. ఆమె ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో గుండెపోటుతో ఈరోజు ఉదయం మరణించారు.