నిజామాబాద్ తెరాస ఎంపి కవిత బుదవారం ఖానాపూర్ లో నిజాంసాగర్ డీ-51 కెనాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణా అన్ని రంగాలలో అద్భుతంగా ప్రగతి సాధిస్తోంది. కానీ ప్రతిపక్షాలు ఓర్వలేక ప్రతీ చిన్న విషయానికి చాలా రాద్దాంతం చేస్తూ మా ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రజలలో మా ప్రభుత్వంపై అసంతృప్తి కలిగేలా చేసి అవి అధికారంలోకి రావాలని తహతహలాడిపోతున్నాయి. కానీ మా ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి రాష్ట్ర ప్రజలు చాల సంతోషంగా ఉన్నారు. మావైపే ఉన్నారు. ‘వచ్చే ఎన్నికలలోగా ప్రతీ ఇంటికి నీళ్ళు ఇవ్వకపోతే ప్రజలను ఓట్లు అడగము’ అని ధైర్యంగా చెప్పగల దమ్మున్న మొగాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. అదే మా నిబద్దతకు ఉదాహరణ. కనుక డిల్లీ నుంచి బాద్ షాలు వచ్చినా లేదా బాహుబలిలు పుట్టుకు వచ్చినా మా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు. ప్రజలను ఆకట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తుంటే మా ప్రభుత్వం రాష్ట్రాన్ని, ప్రజలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తోంది. తెలంగాణాలో ప్రతీ ఆడబిడ్డ ఒక కేసీఆర్ వంటిదే. వారే ప్రతిపక్షాలకు తగినవిధంగా బుద్ధి చెపుతారు. మేము చేస్తున్న పనులే మళ్ళీ ఎన్నికలలో మమ్మల్ని గెలిపిస్తాయనే నమ్మకం మాకుంది,” అని కవిత అన్నారు.
ఈ సందర్భంగా ఆమె తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి, సమాజంలో వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలు, పధకాల గురించి వివరించారు.