ఏడాదిలో లక్ష ఇళ్ళు పక్కా: కేటిఆర్

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెరాస అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తామని కేసీఆర్ వాగ్దానం చేశారు. ఇప్పటికి మూడేళ్ళు గడిచిపోయాయి. ఈ మూడేళ్ళలో కనీసం 10-15,000 ఇళ్ళు అయినా నిర్మించలేదు కానీ చాలా చోట్ల శంఖుస్థాపనలు మాత్రం చేశారు. 

ప్రతిపక్షాలు నిత్యం ఈ హామీని గుర్తుచేస్తూ తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తుంనందునో లేక మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతునందునో తెలియదు కానీ ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించడానికి తెరాస సర్కార్ చురుకుగా ప్రయత్నాలు చేస్తోంది. ఏడాదిలోగా రాష్ట్రంలో 2.60 లక్షల ఇళ్ళు, వాటిలో హైదరాబాద్ లోనే లక్ష ఇళ్ళు కట్టించి చూపుతామని తెరాస సర్కార్ ప్రతిజ్ఞ చేసింది. 

దానిలో భాగంగానే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ మంగళవారం హైదరాబాద్ లోని అంబేద్కర్ నగర్ బస్తీలో రూ.40 కోట్లతో 400 ఇళ్ళు, నగరంలోనే బన్సీలాల్ డివిజన్ లోని బండ మైసమ్మ నగర్ బస్తీలో రూ.34 కోట్లతో 468 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు మంత్రులు కేటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు శంఖుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, నగరంలో లక్ష ఇళ్ళలో 40,000 ఇళ్ళ నిర్మాణానికి టెండర్లు ప్రక్రియ ముగిసి త్వరలోనే నిర్మాణ పనులు మొదలవుతాయని చెప్పారు. మిగిలిన 60,000 ఇళ్ళకి కూడా అన్ని పనులు పూర్తి చేసి త్వరలోనే పనులు మొదలుపెట్టి ఏడాదిలోగానే లక్ష ఇళ్ళ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఒక్కో ఇల్లు 560 చదరపు గజాల విస్తీర్ణం ఉంటుందని చెప్పారు.

తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంతా సమస్యలను అర్ధం చేసుకొని వాటికి పరిష్కారాలు కనుగొనడంలోనే గడిచిపోయింది. అదే సమయంలో ఆంధ్రా సర్కార్ తో గొడవలు నిరంతరంగా సాగాయి. ఆ తరువాత వరుసగా ఎన్నికలను ఎదుర్కోవలసి రావడం వాటి కోసం జరిగిన రాజకీయాలతోనే సమయం తెలియకుండా గడిచిపోయింది. ఆ తరువాత ప్రాజెక్టులు, భూసేకరణ, అనేక సమస్యలు, వాటిపై ప్రతిపక్షాలతో యుద్దాలు సాగిపోయింది. 

ప్రభుత్వం ఇస్తున్న తక్కువ ధరలో ఇళ్ళు నిర్మించడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, కొన్ని చోట్ల భూమి కొరత, ఆర్ధిక పరిమితులు వంటి అనేక కారణాలతో ఇంతకాలం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం నత్త నడకన సాగింది. కానీ ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నందున ఇక ఈ పనులు వేగం పుంజుకోవచ్చు. ఇవన్నీ సిద్దం అయ్యి లబ్దిదారుల చేతికి అందించే సమయానికి ఎన్నికల కోలాహలం మొదలైపోవచ్చు కనుక ఇళ్ళ నిర్మాణంలో మూడేళ్ళు ఆలస్యమైనా తెరాస సర్కార్కు మేలే జరుగుతుంది.