తెరాస సర్కార్ కోమటిరెడ్డికి క్షమాపణలు చెప్పాలి

మంత్రి హరీష్ రావు నిన్న నల్లగొండ జిల్లా కేంద్రంలో బొత్తాయి మార్కెట్ యార్డుకు శంఖుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు కాంగ్రెస్, తెరాస శ్రేణుల మధ్య జరిగిన గొడవలో పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ స్పందిస్తూ, “వాస్తవానికి అక్కడ బొత్తాయి మార్కెట్ యార్డు కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డే తెరాస సర్కార్ తో గట్టిగా పోరాడి సాధించారు. కానీ మంత్రి హరీష్ రావు ప్రోటోకాల్ పాటించకుండా, మా ఎమ్మెల్యే పట్ల కనీస గౌరవం చూపకుండా మార్కెట్ యార్డు శంఖుస్థాపన చేశారు. జిల్లా ఎమ్మెల్యేనయిన నాకు ఈ కార్యక్రమం గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించడానికి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తెరాస కార్యకర్తలు రాళ్ళు రువ్వారు. పైగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తెరాస సర్కార్ అప్రజాస్వామిక విధానాలకు ఇది అద్దం పడుతోంది. తెరాస సర్కార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై పెట్టిన కేసును బేషరతుగా ఉపసంహరించుకొని ఆయనకు క్షమాపణ చెప్పాలి,” అని డిమాండ్ చేశారు.