తెరాసతో పొత్తు పెట్టుకోము: భాజపా

భాజపా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నిన్న ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో జర్నలిస్టులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో మేము ఒంటరిగానే పోటీ చేస్తాము. తెరాసతో సహా ఏ పార్టీతో మేము పొత్తులు పెట్టుకోము. తెరాస సర్కార్ మూడేళ్ళ అప్రజాస్వామిక పరిపాలనతో ప్రజలు విసుగెత్తిపోయున్నారు. తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయం భాజపాయే. కనుక వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా మేము ముందుకు సాగుతాము. ఈ నెల 22 నుంచి మూడు రోజులపాటు మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణాలో పర్యటించబోతున్నారు. ఆ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు మా పార్టీలో చేరే అవకాశం ఉంది. కానీ అమిత్ షా పర్యటనకు వారి చేరికకు ఎటువంటి సంబందమూ లేదు. సాక్షాత్ రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి “రెచ్చిపోతే చచ్చిపోతారు” అని ప్రతిపక్షాలను బెదిరించడాన్ని మేము ఖండిస్తున్నాము. ఆయన మాటలు రాష్ట్రంలో పాలన ఏవిధంగా సాగుతోందో తెలియజేస్తున్నట్లుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన మాటలను ఇంతవరకు ఖండించకపోవడం గమనార్హం,” అని అన్నారు.

ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నప్పటికీ తెరాసతో పొట్టుపెట్టుకోబోమని ఇప్పుడే ఖరాఖండిగా చెపుతున్న లక్ష్మణ్, ‘కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి సోదరులు భాజపాలో చేరబోతున్నారా?” అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు నేరుగా సమాధానం చెప్పకుండా, “ఒకవేళ ఎవరైనా చేరే మాటయితే ముందుగా మీకే తెలియజేస్తాము,” అని చెప్పడం గమనిస్తే వారిరువురూ భాజపాలో చేరవచ్చనే అనుమానం కలుగుతోంది.