చిదంబరం ఇళ్ళపై సిబిఐ దాడులు

మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరం ఇళ్ళపై ఈరోజు ఉదయం నుంచి సిబిఐ అధికారులు దాడులు చేసి శోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై మరియు తమిళనాడు రాష్ట్రంలో 14 చోట్ల వారి ఇళ్ళు, కార్యాలయాలపై సిబిఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. 

చిదంబరం ఆర్ధికమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు కార్తి మరియు అతని స్నేహితులు బారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎయిర్ సెల్-మాక్సిస్ కేసులో ఫెమా నిబంధనలను ఉల్లంఘించి రూ.45 కోట్లు మనీలాండరింగ్ కు పాల్పడినట్లు వారిపై ఈడి ఇదివరకే కేసులు నమోదు చేసింది. వారిపై ఇంకా అనేక ఆర్ధిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు, వాటిపై కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసుల విషయంలోనే నేడు సిబిఐ దాడులు జరుగుతున్నాయి. 

దీనిపై చిదంబరం స్పందిస్తూ “నేను ఎన్డీయే ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపిస్తూ పత్రికలకు వ్యాసాలు వ్రాస్తునందునే కేంద్ర ప్రభుత్వం నాపై కక్ష కట్టి ఈవిధంగా మమ్మల్ని ఈరకంగా వేధిస్తోంది. నేను, నా కుమారుడు, అతని స్నేహితులు  ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదు. చట్ట వ్యతిరేకమైన పనులు చేయలేదు. నా కుమారుడి కంపెనీల ఆర్ధిక లావాదేవీలన్నీ చాలా పారదర్శకంగా నిర్వహిస్తున్నాడు. దీనిపై మేము ఇచ్చిన వివరణలను పట్టించుకోకుండా సిబిఐ మా ఇళ్ళపై దాడులు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యలే. కానీ మేము ఇటువంటి బెదిరింపులకు భయపడము. ప్రభుత్వం తప్పు చేస్తుంటే తప్పకుండా నిలదీస్తాను,” అని అన్నారు.