తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉద్దేశ్యించి తీవ్రవిమర్శలు చేసి ధర్నా చౌక్ వద్ద జరిగిన దానికి ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని గట్టిగా హెచ్చరించారు. “రాష్ట్రంలో ఎక్కడా కనబడకుండా పోయిన పార్టీలో మిగిలింది నువ్వొకడివే. కానీ ముఖ్యమంత్రిని ఉద్దేశ్యించి అమర్యాదగా మాట్లాడుతావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మేము కళ్ళు తెరిస్తే హైదరాబాద్ లో నువ్వు నీ పార్టీ ఉండలేరు జాగ్రత్త. ఇదే చివరి వార్నింగ్ నీకు..నీ పార్టీకి. మళ్ళీ నోటికివచ్చినట్లు మాట్లాడితే కటినంగా వ్యవహరించవలసి వస్తుంది జాగ్రత్త!” అని రేవంత్ రెడ్డిని మంత్రి తలసాని హెచ్చరించారు.
ఇందిరా పార్క్ వద్ద నిన్న జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతూ “ధర్నా చేయడానికి వచ్చిన వామపక్ష కార్యకర్తలు ఇనుప పైపులకు జెండాలు తగిలించుకొని ఎందుకు వచ్చినట్లు? అంటే దాడికి ముందస్తుగానే సిద్దం అయ్యి వచ్చినట్లు స్పష్టం అవుతోంది కదా? ధర్నా చౌక్ తరలించాలని ధర్నా చేసినవారిలో మహిళా పోలీసులు మఫ్టీలో పాల్గొన్నారన్న మాట అబద్దం. అదే చేయాలనుకొంటే 20 మందే ఎందుకు వెయ్యి మందిని మఫ్టీలో పెట్టి ధర్నా చేయించి ఉండేవారిమి కదా? కాంగ్రెస్, భాజపా, తెదేపా, వామపక్షాల నేతలు, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు స్థానిక ప్రజల అభిప్రాయాలను, వారి సమస్యలను, ఆకాంక్షలను అర్ధం చేసుకోకుండా మొండిగా ధర్నా చౌక్ కోసం అలజడి సృష్టిస్తున్నారు. దాని వలన వారినే ప్రజలు దూరం పెడతారని గ్రహించడం లేదు. నిన్న జరిగిన ఘటనలకు ఉత్తం కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి బాధ్యులు కనుక వారు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి,” అని తలసాని శ్రీనివాస్ అన్నారు.