ఇందిరా పార్క్ వద్ద నిన్న జరిగిన హింసాత్మక సంఘటనల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ను కలిసి వివరించారు. తమ ప్రభుత్వం అంగన్ వాడి, ఆశా వర్కర్లు ఒక్కో వర్గం పనివారికి జీతాలు పెంచుతూ వారి యోగక్షేమాలు పట్టించుకొంటున్నందున వారందరూ క్రమంగా వామపక్షాలకు దూరం అవుతున్నారని, దానితో రాష్ట్రంలో తమ ఉనికిని కోల్పోతామనే భయంతోనే వామపక్షాలు ధర్నా చౌక్ పరిరక్షణ సాకుతో తమ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుచేసేందుకు నిన్న అంతగా రెచ్చిపోయాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు కూడా వేరే పనేమీ లేకపోవడంతో ఇటువంటి సమస్యలను తీసుకొని రచ్చ చేస్తున్నాయని అన్నారు. ధర్నా చౌక్ తరలింపు కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిసి ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు నిన్న హద్దు మీరి ప్రవర్తించాయని కేసీఆర్ చెప్పారు. వామపక్షాల కార్యకర్తలు, కొన్ని అరాచక శక్తులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలపై నిన్న దాడులు చేశాయని చెప్పారు. కోర్టు తీర్పు, ప్రజాభీష్టం మేరకే ధర్నా చౌక్ తరలింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.