ఇందిరా పార్క్ వద్ద నుంచి ధర్నా చౌక్ ని తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం అక్కడే ధర్నాకు కూర్చొన్నారు. అయితే స్థానికుల ముసుగులో తెరాస కార్యకర్తలు, పోలీసులే ధర్నా చేస్తున్నారని ప్రతిపక్ష, ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలకు నిదర్శనంగా ఈరోజు ఉదయం వాకర్స్ క్లబ్ మహిళా సభ్యులతో కలిసి సుమారు 15 మంది మహిళా పోలీసులు సాధారణ దుస్తులు ధరించి ధర్నా చౌక్ ను అక్కడి నుంచి తరలించాలని వ్రాసున్న ప్లకార్డులు చేతపట్టుకొని ధర్నాలో పాల్గొన్నారు. విశేషం ఏమిటంటే వారిలో లేక్ వ్యూ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి కూడా ఉన్నారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ హె.ఎం.టీవి విలేఖరి వారిని గుర్తుపట్టి వీడియో కెమేరాతో చిత్రీకరించడం మొదలుపెట్టగానే వారందరూ తమ చేతుల్లో ఉన్న ప్లకార్డులు అక్కడే పడేసి హడావుడిగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు.