ధర్నా చౌక్ వద్ద ఊహించిందే జరిగింది. ధర్నా చౌక్ అనుకూల వ్యతిరేక వర్గాలను పోలీసులు అనుమతించడంతో, ఇరు వర్గాలకు మద్య వాదోపవాదాలతో మొదలైన ఘర్షణ వాతావరణం కర్రలతో కొట్టుకొనేవరకు వెళ్ళింది. వామపక్ష కార్యకర్తలు స్థానికులపై దాడి చేయడంతో హటాత్తుగా పరిస్థితి అదుపు తప్పింది. స్థానికులు అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలను వామపక్ష కార్యకర్తలు ముక్కలు ముక్కలుగా విరిచి ద్వంసం చేశారు. పరిస్థితులు అదుపుతప్పడంతో పోలీసులు రంగంలో దిగి స్వల్పంగా లాఠీఛార్జి చేయడం పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని అంబులెన్స్ లలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ధర్నా చౌక్ వద్ద ప్రస్తుతం యుద్దవాతవరణం నెలకొని ఉంది.
ధర్నా చౌక్ వద్దకు ఇంకా చాలా బారీ సంఖ్యలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు చేరుకొంటూనే ఉన్నారు. టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, తెదేపా నేతలు ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి తదితరులు ధర్నా చౌక్ వద్దకు చేరుకొన్నారు. మరికొద్ది సేపటిలో అక్కడ వారి సభ ప్రారంభం కాబోతోంది. కానీ అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులలో సభ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశ్యపూర్వకంగానే ఈవిధంగా చేశారు. స్థానికులను, పోలీసులను మాపైకి ఉసిగొల్పి మా కార్యక్రమాన్ని రసాభాస చేశారు. ఆయన ఇదివరకు డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తే తప్పులేదు కానీ ఇక్కడ ధర్నా చౌక్ లో ఎవరూ ధర్నాలు చేయకూడదని హుకుం జారీ చేయడం ఆయనలోని నియంతృత్వానికినిదర్శనం. ధర్నా చౌక్ ఏమైనా ఆయన జాగీరా? ఇక్కడ అనేక ఏళ్ళుగా ధర్నాలు జరుగుతుంటే వాటిని వేరే చోట చేసుకోమని చెప్పడానికి ఆయనకు ఏమి హక్కు ఉంది? ఇక్కడ జరిగిన దురదృష్టకర ఘటనలకు ఆయనే భాద్యత వహించాలి. తక్షణమే ప్రజలకు క్షమాపణలు చెప్పాలి,” అని అన్నారు.
పిసిసి ప్రెసిడెంట్ ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ “నాలుగు కోట్ల మంది తెలంగాణా ప్రజలు కేసీఆర్ కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తున్నారు. సామాన్య ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం లేకుండా చేసి నియంతలా పరిపాలిస్తున్నారు. ఆయనకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెపుతారు. స్థానికులకు, ధర్నా చౌక్ కోసం పోరాడుతున్నవారు గొడవపడేలా చేసింది కేసీఆరే. కనుక ఇక్కడ జరిగిన ఘటనలకు ఆయనే బాధ్యత వహించాలి,” అని అన్నారు.